Chwilio ffurf

1 యోహాను 2

క్రీస్తు మనకోసం విజ్ఞాపన చేస్తూ ఉండడం వల్ల సహవాసం కొనసాగుతున్నది

1నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

సహవాసం గురుతులు: విధేయత, ప్రేమ

3ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4“నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. 5కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

6ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి. 7ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే.

8అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది. 9తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 10తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. 11కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

12ప్రియమైన చిన్నపిల్లలారా! ఆయన నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.

13తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.

14చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను.

తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను.

యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.

దేవుని పిల్లలు ఈ లోకాన్ని ప్రేమించకూడదు

15ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం- ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించే వారి విషయం జాగ్రత్తగా ఉండాలి

18పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది. 19వారు మన దగ్గర నుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వారు మనకు సంబంధించినవారు కాదని కనబడుతూ ఉంది.

20కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు. 21మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను. 22యేసే క్రీస్తు అని అంగీకరించని వాడే అబద్ధికుడు. తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి. 23కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.

24మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలోఅలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. 25ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. 26ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారిని గురించి రాశాను.

27ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి.

28కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి.

చిన్నపిల్లలు ఒకరినొకరు ఎలా గుర్తిస్తారు?

29ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index